కోవిడ్‌ మరణాల పోర్టల్‌ను ప్రారంభించిన కేరళ

కోవిడ్‌-19 మరణాల సమాచార పోర్టల్‌ను కేరళ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారి సరైన సంఖ్యను సరిగ్గా నమోదు చేసేందుకు దీన్ని తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ను ప్రారంభించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా మరణాల సమాచార పోర్టల్‌ను ప్రారంభించామని, దీని ద్వారా మరిన్ని కరోనా మరణాల గురించి వివరాలను తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ పోర్టల్‌ను ప్రజలు, ప్రభుత్వం వినియోగించవచ్చునన్నారు. తమ బంధువులకు సంబంధించిన మరణ వివరాలను తెలుసుకునేందుకు ఇందులో సెర్చ్‌ చేయవచ్చునని అన్నారు. ప్రభుత్వం నివేదించిన కోవిడ్‌ మరణాలను ఈ పోర్టల్‌లో చూడవచ్చునన్నారు. పేరు, జిల్లా, మరణించిన తేదీ ఆధారంగా వివరాలను పొందవచ్చునని చెప్పారు. వివిధ ప్రభుత్వ సంస్థలు జిల్లా వైద్య కార్యాలయాలు (డిఎంఒ)లు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల ప్రామాణికతను వివిధ ప్రభుత్వ సంస్థలు పరిశీలించనున్నాయని, ప్రస్తుతం జులై 22, 2021 వరకు కోవిడ్‌ మరణాలు అందుబాటులో ఉన్నాయని, ఆ తర్వాత చోటుచేసుకున్న మరణాల సంఖ్యను తాజా పరుస్తామని చెప్పారు.