ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఏపీని ‘నివర్ తుఫాను’ ముంచెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం 27 అంశాలతో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో నివార్‌ తుపాన్‌పై ప్రధానంగా చర్చించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని మంత్రి కన్నబాబు తెలిపారు. పదివేల మందికి పైగా వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించామన్నారు. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలు, 13 వందల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారని కన్నబాబు తెలిపారు.

డిసెంబర్ 15 న వైఎస్సార్ పంటల బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది అని ప్రభుత్వమే సొంతంగా వచ్చే ఏడాది లోగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది అన్నారు. డిసెంబర్ 2 న ఆముల్ పాల వెల్లువ కార్యాక్రమమం ప్రారంభం అవుతుంది అని ఆయన చెప్పారు. పాలకు అదనంగా ఇస్తామన్న 4 రూపాయలు అదనపు ధర కూడా అదే రోజు నుండి అందించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వార్తల్ని ఖండించింది కేబినెట్‌. పోలవరం ప్రాజెక్టు ఎత్తు సెంటీమీటర్‌ కూడా తగ్గదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం ఉంటుందన్నారు.

ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విడతల వారిగా 3 డీఏల చెల్లింపునకు ఆమోదం, 2021 జనవరి నుంచి వర్తిస్తాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లింపు చేస్తామన్నారు. డిసెంబర్‌ 25న 30 లక్షల 60 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయనుంది ప్రభుత్వం. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 21న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు అని వచ్చే నెల 25 నుంచి ఏపీలో భూముల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పారు.