వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే వాచ్ మెన్ల హత్యలు: ఆళ్ళ హరి

  • పోలీసు వ్యవస్థలో వైసీపీ నేతల మితిమీరిన జోక్యం మంచిది కాదు
  • అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అర్ధరాత్రుల మద్యం విక్రయాలు
  • ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం సన్నగిళ్లటం సమాజానికి మంచిది కాదు.
  • నగర ప్రజానీకానికి తగ్గట్లుగా పోలీసు సిబ్బందిని నియామకం చేయాలి.
  • అర్ధరాత్రులు గస్తీ పెంచాలి.
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలో వైసీపీ నేతల మితిమీరిన జోక్యం, గంజాయి హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను నివారించటంలో పూర్తి వైఫల్యం. పరిపాలన గాలికొదిలేసి బటన్ నొక్కే దగ్గరే నేతలు పరిమితం కావటం వీటికి తోడు వైసీపీ నేతల అసమర్థత కారణంగానే మంగళవారం అర్ధరాత్రి వాచ్ మెన్ల హత్యలు జరిగాయని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగల చేతిలో ఇద్దరు వాచ్ మెన్లు హత్యకు గురికావడం నగరంలో శాంతిభద్రతల లోపాన్ని తెలియచేస్తుందన్నారు. రెండు హత్యల సంఘటనలు తెలియడంతో నగర ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారన్నారు. నగరంలో ప్రతీ చోట సీసీ కెమెరాలు పెట్టామని, నగరంలో క్రైం రేటు తగ్గిందని పోలీసులు హడావుడి చేయటం మినహా వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నాయనటానికి ఈ హత్యలే నిదర్శనమని పేర్కొన్నారు. అసాంఘిక సంఘటనలు జరిగినప్పుడు మినహా పోలీస్ గస్తీ ఎక్కడా కనిపించటం లేదన్నారు. ఒకవైపు నగర విస్తీర్ణం పెరగటంతో ప్రజానికానికి తగ్గ స్థాయిలో పోలీసు సిబ్బంది లేకపోవటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు వ్యవస్థలో వైసీపీ చోటా నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర నేత వరకు మితిమీరిన జోక్యంతో పోలీసులు తమ విధిని సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు, వారిపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసు వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజల రక్షణను వైసీపీ నేతలు గాలికొదిలేసారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు అరెస్ట్ లు చేయించడం దగ్గరే పోలీసు వ్యవస్థను వైసీపీ నేతలు పరిమితం చేసారని ధ్వజమెత్తారు. నగరంలో ప్రమాదకర స్థాయిలో గంజాయి వాడకం ఎక్కువైందని, వీరికి బ్లెడ్ బ్యాచ్ తొడవటంతో రాత్రులు పది దాటితే ప్రజలు బయటికి వచ్చే పరిస్థితులు లేవన్నారు. అర్ధరాత్రులు సైతం ఎక్కడపడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో తాగుబోతులు సృష్టిస్తున్న వీరంగం అంతాఇంతా కాదన్నారు. నగర శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రులు గంజాయి, మద్యం సేవించటం ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ప్రాణాలను సైతం తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టవద్దని, అది సమాజానికి మంచిది కాదన్నారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా దేవుడి కన్నా మొదట గుర్తుకువచ్చేది పోలీసేనన్నారు. అలాంటి పోలీసులు అధికార పార్టీ నేతల సేవల్లో తరిస్తే ప్రజలు తమ గోడుని ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఇప్పటికైనా పోలీసులు దొంగలపై, బ్లెడ్ బ్యాచ్ పై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు. శివారు ప్రాంతాల్లో రాత్రి గస్తీని పెంచాలని మనవి చేశారు. నగర ప్రజానీకానికి తగ్గ స్థాయిలో సిబ్బంది నియామకానికై ప్రభుత్వానికి నివేదికను అందచేయాలని ఆళ్ళ హరి పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.