బొలిశెట్టిపై పోరాటం చేసే శక్తి కొట్టుకు లేదు

  • డూప్‌ను తీసుకొచ్చే పరిస్థితి కొట్టుకు దాపురించింది
  • డూప్‌ డూపే… ఒరిజినల్‌ ఒరిజినలే..!
  • ఇళ్ళస్థలాల పట్టాల సమస్య పరిష్కరిస్తా..!
  • నేను గెలిస్తే మీ వెంట ఉంటా..!

తాడేపల్లిగూడెం: సార్వత్రిక ఎన్నికల్లో డూప్‌ను తీసుకొచ్చే పరిస్థితి కొట్టు సత్యనారాయణకు దాపురించిందని, డూప్‌ డూపే… ఒరిజినల్‌ ఒరిజినలేనని ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శనివారం రాత్రి తాడేపల్లిగూడెం పట్టణం 31, 32వ వార్డులో మాజీ కౌన్సిలర్‌ మారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎవరి దయాదాక్షిణ్యాలపై పోటీ చేయడం లేదన్నారు. తమ సొంత సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. నాడు జగన్‌ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తామని చెప్పారని, ఏ ముఖం పెట్టుకుని మహిళల ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అతని అవినీతి గురించి చెప్పడానికి రోజులు సరిపోవన్నారు. బొలిశెట్టిపై పోరాటం చేసే శక్తి ఆయనకు లేదని కొట్టు సత్యనారాయణ నుద్దేశించి పేర్కొన్నారు. డూప్‌లు సినిమాల్లోనే ఉంటారని, బొలిశెట్టికి డూప్‌ తెచ్చుకునే పరిస్థితి ఆయనకు దాపురించిందన్నారు. తన వెంట వచ్చే వారంతా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కష్టపడి పనిచేస్తున్నారన్నారు. తాను మున్సిపల్‌ చైర్మన్‌గా ఉండగా తన కొడుకుని సైతం మున్సిపాల్టీ దరిదాపుల్లోకి రాకుండా ధర్మమైన పాలన సాగించానన్నారు. లంచగొండితనం పోగొట్టాలంటే కొట్టు సత్యనారాయణను ఓడిరచాలన్నారు. తాను ఎక్కడా డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని కొట్టుకు సవాల్‌ విసిరారు. 2014 నుంచి రౌడీయిజం చేసింది ఎవరని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే మీ వెంట ఉంటానని, కొట్టు సత్యనారాయణ గెలిస్తే కుటుంబం గురించి పనిచేస్తాడన్నారు. కొట్టు సత్యనారాయణ తన పక్కనున్న ఎవరికి న్యాయం చేశారని ప్రశ్నించారు. డిబేట్‌ పెడితే మున్సిపల్‌ చైర్మన్‌గా తాను ఏం అభివృద్ది చేశానో చెబుతానన్నారు. స్థానిక ఇళ్ళపట్టాల సమస్యను అవసరమైతే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానన్నారు. తాడేపల్లిగూడెంకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలన్నారు. గాజు గ్లాసు పగలగొడితే నీకే గుచ్చుకుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అటువంటి గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసే అవకాశం కల్పించిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ వలవల బాబ్జి, బిజెపి కన్వీనర్ ఈతకోట తాతాజీ, మారం వెంకటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.