ఢిల్లీలో కోవిడ్ ఉదృతి.. పరిస్థితి సమీక్షకు కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

ఢిల్లీలో కరోనా ఉదృతి ఒక్కసారిగా పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 7,486 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో నగరంలో పెరిగిన కేసుల సంఖ్య 5 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్కరోజే 131 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 7,943 కి చేరింది. ఈ నెల 17 న 62 వేల టెస్టులు నిర్వహించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాజిటివ్ రేటు 12.03 శాతమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి సీజన్ తో బాటు వాయుకాలుష్యం కూడా పెరగడం కేసుల ఉధృతికి ఓ కారణమని అంటున్నారు.

వైరస్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటంతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కరోనా కట్టడి కోసం ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే దిల్లీలో వివాహాది శుభకార్యాలకు అతిథుల సంఖ్యను 200 నుంచి 50కి పరిమితం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ తెస్తారని ప్రచారం సాగుతుండగా.. అలాంటిదేమీ లేదని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్‌ బుధవారం స్పష్టం చేశారు.