వలస కార్మికుల వేతనాలను తగ్గించడంపై కేటీఆర్ అభ్యంతరం

విదేశాల్లో పని చేసే కార్మికుల కనీస వేతనాలు తగ్గించడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లోని వలస కూలీల కనీస వేతనాలను 30 నుంచి 50 శాతం తగ్గించడం అన్యాయమని. ఈమేరకు ఆయన.. ట్విట్టర్‌ వేదికగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విన్నపం చేశారు. కనీస వేతన ఒప్పందాల్లో కేంద్ర మార్పులతో వలస కార్మికులకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన వలస కూలీలు ఎక్కువగా పనిచేస్తున్నారని వారిపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కోవిడ్‌, లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని.. వలస కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి కేటీఆర్.