చేనేత కళాకారులకు కళాభివందనాలు

భారతీయ కళలు ప్రపంచంలో ఎంతటి విశిష్ట స్థానాన్ని పొందాయో జగత్విదితమే. అటువంటి కళల్లో వారసత్వంగా విరాజిల్లుతున్నదీ.. సృజనాత్మకమైనది మన చేనేత కళారంగం. అటువంటి చేనేత కోసం నేడు జాతీయ దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరం. ఈ వేడుక వేళ నా తరఫున, జనసేన పార్టీ తరఫున దేశంలోని చేనేత కళాకారులందరికీ కళాభివందనాలు తెలుపుతున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మన దేశ స్వతంత్ర సంగ్రామంలో చేనేత కూడా ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడింది. అఖండ భారతావనిలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో శైలితో తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న ఈ కళను నమ్ముకున్న వారు మాత్రం ఇంకా అర్ధాకలితోనే జీవనం సాగిస్తుండటం దురదృష్టకరం. అయినా వెరవక నేత కళను సజీవంగా నిలుపుతున్నారు. ఈ కళా రంగంపై లోతయిన అధ్యయనం జరగాలి. కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడే దాకా ప్రత్యక్షంగా ప్రభుత్వం, పరోక్షంగా ప్రజలు ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండాలి. దేశంలోని ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్న దృఢ సంకల్పాన్ని బలంగా గుండెల్లో నిలుపుకోవాలి. ఆచరణాత్మకంగా అడుగులు వేయాలి. చేనేత వస్త్రాలు ధరించినప్పుడు కలిగే నిడారంబరత, ప్రశాంతత, లాలిత్యం మనసును హత్తుకుంటుంది. ఇటువంటి గొప్ప సుగుణాలున్న చేనేతకు నా జీవితాంతం వారధి (బ్రాండ్ అంబాసిడర్)గా నిలబడతానని పునరుద్ఘాటిస్తున్నాను. చేనేత కళాకారులు ఆర్థిక పుష్టితో ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.