తలైవా ఆరోగ్యంపై తాజా అప్‌డేట్..

సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో వైద్యులు మరో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. రజినీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. బీపీ అదుపులోనే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళన చెందే అంశాలు లేవని తెలిపారు. మరికొన్ని పరీక్షలు చేశామని.. వాటి రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. ఆ వైద్య పరీక్షల నివేదికలతో పాటు బీపీ స్టేటస్‌ను రాత్రంతా చూసిన తర్వాత.. రజినీకాంత్‌ను డిశ్చార్జిపై రేపు నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న అన్నాతై సినిమా షూటింగ్‌లో కరోనా కంగారు పుట్టించింది. హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. యూనిట్‌లో 8 మంది సభ్యులకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. అయితే కరోనా టెస్ట్‌ల్లో రజినీకాంత్‌కు నెగెటివ్‌ రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పలువురికి కరోనా సోకడంతో షూటింగ్‌ను వాయిదా వేస్తునట్టు అన్నాత్తై సినిమాను నిర్మిస్తున్న సన్‌నెట్‌వర్క్‌ ప్రకటించింది.