త్వరలో లేపాక్షికి యునెస్కో గుర్తింపు: పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక

తెలుగు రాష్ట్రాల్లోని మరో చారిత్రక కట్టడానికి యునెస్కో గుర్తింపు దక్కనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయానికి రెండు రోజుల క్రితమే యునెస్కో గుర్తింపు లభించింది. త్వరలోనే అనంతపురం జిల్లాలోని ప్రఖ్యాత లేపాక్షి ఆలయానికి కూడా యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్టు టీజీ వెంకటేశ్ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం నిన్న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అలాగే, రాతియుగానికి చెందిన కేతవరం గుహలను కూడా ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చాలని యునెస్కోను కోరనున్నట్టు తెలుస్తోంది.

యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చేందుకు అర్హమైన కేంద్రాలు, నిర్మాణాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయడంలో కేంద్రానికి సహాయం అందించాలంటూ ఆయా రాష్ట్రాలకు స్థాయీ సంఘం సిఫారసు చేసింది. అలాగే, ఏపీలో రూ. 159 కోట్లతో 13 చోట్ల ప్రపంచస్థాయి మ్యూజియంలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్థాయీ సంఘం తన నివేదికలో పేర్కొంది.