గుంటూరు తూర్పులో జనసేన జెండా ఎగరేద్దాం: నేరేళ్ళ సురేష్

ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే క్షేత్రస్థాయిలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గం గుంటూరు తూర్పు నియోజకవర్గమని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నేరేళ్ళ సురేష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో జనసేన విజయబావుటా ఎగరేసేందుకు జనసైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ నగర, డివిజన్ నాయకులతో విడతలవారీగా ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ జనంలోకి జనసేన, సమస్యలపై జనసేన సమరభేరీ కార్యక్రమాలతో ప్రజలకు అత్యంత చేరువయ్యామని తెలిపారు. ఇంటింటికి జనసేన, ప్రతీ హృదయంలో జనసేన వినూత్న కార్యక్రమాలతో జనసేన ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవటం సంతోషకరమన్నారు. నగర, డివిజన్ కమిటీలతో పాటూ బూతు కమిటీలతో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక అన్నారు. తూర్పు నియోజకవర్గ గెలుపుని పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు కు బహుమతిగా ఇచ్చేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి, భావితరాల వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు పొత్తులో ముందుకు సాగుతున్నారని విశదీకరించారు. ఈ పొత్తుని విడదీయాలని వైసీపీ చేసే విషప్రచారాన్ని, కుట్రలను జనసేన-టీడీపీ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని కోరారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీ శ్రేణులు కిందిస్థాయి నుంచి కలిసిమెలిసి ముందుకు సాగాలని నేరేళ్ళ సురేష్ కోరారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, పులిగడ్డ గోపి, రాతంశెట్టి జగన్, యజ్జు రాజేష్ ఖన్నా, సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, టీడీపీ నేతలు నాగలపాటి శ్రీనివాస్, సోమ బాలయ్య, వాణి చౌదరి, సూరం లక్ష్మీ, నండూరి స్వామి, మిద్దె నాగరాజు, పులిగడ్డ నాగేశ్వరరావు, తేజ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.