నెల్లూరు జిల్లా కోవూరు చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందాం: డేగల దొరస్వామి

  • ఆంధ్రప్రదేశ్ ఆస్తుల అమ్మకాల ప్రక్రియ నెల్లూరుకు చేరె

నెల్లూరు జిల్లా, కోవూరు చక్కెర కర్మాగారం. రాష్ట్రంలోనే తొలి సహకార రంగంలో నిర్మించిన తొలి పరిశ్రమ. 1979వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 126.40 ఏకరాలాలో ఈ పరిశ్రమని నిర్మించారు. ఈ చక్కెర కర్మాగారం నిర్మించక ముందు రైతులు కేవలం వరి మీదనే ఆధారపడేవారు. చెరకు కర్మాగారం వచ్చాక రైతులు చెరకును పండించి మంచి లాభం పొందేవారు. వాతావరణం సహకరించే పరిస్థితులు ఉన్నందున చక్కెర పంట బాగా పండేది. దాదాపు 15 వేల ఏకరాలలో చెరకును రైతులు పండించేవారు. ఈ క్రమంలో కోవూరు చక్కెర కర్మాగారంకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచ దేశాలు కోవూరు చక్కెరని రుచి చూశారు. ఇంతటి పేరున్న చక్కెర కర్మాగారాన్ని కొన్ని కారణాలు వలన 2013 లో మూసివేయడం జరిగింది. అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు 20 కోట్ల రూపాయలు దాకా బకాయిలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కోవూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కోవూరు చక్కెర కర్మాగారాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునః ప్రారంభం చేస్తామని , ఇప్పటి వరకు ఉన్న బకాయిలు పూర్తిగా తీరుస్తామని చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కోవూరు చక్కెర కర్మాగారం ఊసే మరిచారు. 2019 ఎన్నికలకు ముందు కోవూరు నియోజకవర్గ అప్పటి వైసీపీ ఇంచార్జి, ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అవ్వగానే కోవూరు చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తాం అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అయి ఇప్పటికి మూడు ఏళ్లు అయింది కానీ ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. తాజాగా ఈ వైసీపీ ప్రభుత్వం చక్కెర కర్మాగారాల మీద ఒక జీవో విడుదల చేసింది. పని చెయ్యకుండా ఉండే చక్కెర కర్మాగారాలకు సంభందించి జీవో నంబర్ 15 ని తీసుకురావడం జరిగింది. ఈ జీవో నంబర్ 15 సారాంశం ఏంటంటే లిక్విడేషన్ పేరుతో చక్కెర కర్మాగారం స్థలాన్ని వేరే వాళ్ళకి బదలాయించే విధానం. 126.40 ఏకరాలా స్థలాన్ని కారు చౌకగా వేరే వాళ్లకు అమ్మేసే ప్రక్రియ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ చెరకు రైతు సంఘాలు కూడా ఉద్యమం బాట పట్టారు. ఈ సమస్యని జనసేనపార్టీ భాద్యతగా తీసుకుని కోవూరు చక్కెర కర్మాగారాన్ని అమ్మెసే ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాడి రైతులకు అండగా నిలబడితే బాగుంటుంది. ఈ చక్కెర కర్మాగారం వలన ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా వరి పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటగా కూడా ఉంటుంది. దళారుల అక్రమాలకు, దౌర్జన్యాలకు కళ్లెం పడుతుంది. ఫెర్టిలైజర్స్ దోపిడీ నుంచి కూడా రైతులను ఆదుకున్న వాళ్ళమవుతాము. 100 కోట్లు రూపాయలు ఖర్చు చెయ్యగలిగితే కోవూరు చక్కెర కర్మాగారం తిరిగి పునః ప్రారంభం అవుతుంది. కానీ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కోవూరు చక్కెర కర్మాగారం మీద ఖర్చు పెట్టలేకపోతుంది. ప్రభుత్వం దగ్గర నిజంగా 100 కోట్ల రూపాయలు లేకపోతే 126.40 ఏకరాలలో 60 ఏకరాలు అమ్మేసి, చక్కెర కర్మాగారంలో ఉండే పాత మిషనరీ అమ్మేసినా కూడా చక్కెర కర్మాగారం తిరిగి ప్రారంభానికి నోచుకుంటుంది. కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి ఈ చక్కెర కర్మాగారాన్ని అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ అమ్మకాన్ని ఆపగలిగితే మనం విజయం సాధించిన వాళ్ళమి అవుతామని జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి అన్నారు.