పంచాయతీలను కాపాడుకుందాం

* 5వ తేదీన జనసేన కేంద్ర కార్యాలయంలో చర్చాగోష్టి
పరిపాలనలో.. క్షేత్ర స్థాయి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో పంచాయతీరాజ్ పాత్ర విస్మరించలేనిది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయకుండా, ఆ వ్యవస్ధను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో పంచాయతీలకు పునర్వైభవం తీసుకొచ్చి, గ్రామ స్వరాజ్యం దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు 5వ తేదీన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ‘పంచాయతీలను కాపాడుకుందాం’ అనే అంశంతో చర్చాగోష్టి నిర్వహించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారాహి విజయ యాత్రలో కలిసిన పలువురు గ్రామ సర్పంచులు, పంచాయతీ వ్యవస్థపై సాధికారత కలిగిన విద్యావేత్తలు- పంచాయతీల సమస్యలని తెలిపారు. ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను ఆర్థికంగా బలహీనపరచడంతోపాటు సర్పంచులను వేధించడం, నిధులు అడిగితే చెక్ పవర్ రద్దు చేసి కక్ష సాధింపు చర్యలకి దిగుతున్న తీరును వివరించారు. పంచాయతీలను కాపాడుకుందాం కార్యక్రమంలో పంచాయతీల బలోపేతం, నిధుల బదలాయింపు, సర్పంచులు ఎదుర్కొంటున్న రాజకీయపరమైన ఒత్తిళ్లు తదితర సమస్యలపై చర్చించనున్నారు.