జగనన్న రాజ్యంలో ప్రజల కళ్లకు ‘‘గుంతలు’’

• రాష్ట్ర వాటా ఇవ్వలేక రుణం డబ్బులను వినియోగించలేని దుస్థితి
• వాయుగుండం దెబ్బకు అత్యంత అధ్వానంగా రోడ్లు
• ఎన్ డీ బీ రుణం పనులన్నీ మధ్యలోనే….

ఉన్న రోడ్లకే గతి లేదు అంటే… వాయుగుండం దెబ్బకు రాష్ట్ర రహదారులు మరింత దుర్భరంగా తయారయ్యాయి. జాతీయ రహదారులు దాటి… రాష్ట్ర రహదారుల్లోకి అడుగుపెట్టగానే నరకం కనిపిస్తోంది. గజానికో గొయ్యి… అగుడుకో గుంత అన్నట్లు రాష్ట్ర రహదారులు అధ్వానంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రహదారులపై జనసేన పార్టీ సాగించిన పోరాటం తర్వాత రోడ్లను బాగు చేస్తామని మాట ఇచ్చిన వైసీపీ సర్కారు అనేకానేక తేదీలను మారుస్తూ పోయింది. గతంలో ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేక, రుణం వచ్చినా దాన్ని వినియోగించుకోలేక వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చతికిల పడింది.
• న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌ డీ బీ) రుణంతో రహదారులకు మహర్దశ రానుందని, రూ.6,400 కోట్లతో దాదాపు 3,100 కి.మీ. మేర రహదారులు, వంతెనల అభివృద్ధికి వీలు కలుగుతుందని చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లే రహదారులను బాగు చేసేందుకు దీనిలో ప్రాధాన్యమిస్తున్నామనీ చెప్పారు. శిథిలావస్థలో ఉన్న 676 వంతెనల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని చెప్పిన మాటలు కల్లలయ్యాయి.
• 2019, నవంబరు 4న ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమీక్షలో సీఎం చెప్పిన మాటలు విని అంతా ఆనందపడ్డారు. సీఎం జగన్‌ రెడ్డి తాను చెప్పిన మాటలనే కాదు.. చేసిన సమీక్షలనూ మర్చిపోతున్నారు. ఆర్‌ అండ్‌ బీ అధికారులతో ఎన్‌ డీ బీ రుణంపై సమీక్ష జరిగి మూడేళ్ల ఎనిమిది నెలలు గడిచినా పనులు నత్తతో పోటీ పడుతున్నాయి.
• వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చేసిన హడావుడి తర్వాత రాష్ట్ర వాటా చెల్లించాల్సిన సమయానికి చల్లబడిపోయింది.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులు, మండల కేంద్రాల మధ్య అనుసంధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడం.. మధ్యలో ఉన్న వంతెనల పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం రూ.6,400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌ డీ బీ) అనే విదేశీ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఇందులో రూ.4,480 కోట్లు (70 శాతం) ఎన్‌ డీ బీ రుణం కాగా, రూ.1,972 కోట్లు (30 శాతం) రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక రుణం మంజూరు కావడం మొదలైంది. దీంతో ఆయా రహదారులకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు.
• వచ్చిన రుణంతో రెండు దశలుగా పనులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2021లో చేపట్టిన మొదటి దశలో 1,244 కి.మీ. విస్తరణ, 204 వంతెనల నిర్మాణం ఇప్పటికి నాలుగేళ్లు దాటినా 20 శాతం కూడా పూర్తి కాలేదు. రెండో దశ కింద 13 ఉమ్మడి జిల్లాల్లో 1,267.56 కి.మీ.ల రహదారుల విస్తరణ, 253 వంతెనల నిర్మాణ పనులను ప్రతిపాదించారు. వీటికి రూ.3,386.14 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,016 కోట్లు కాగా.. మిగిలింది ఎన్‌ డీ బీ రుణంగా ఇస్తుంది. ఇందుకోసం ఆర్‌ అండ్‌ బీ అధికారులు జిల్లాల వారీగా 119 రహదారులను ఎంపిక చేసి, 2021 ఆగస్టులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు పరిపాలన అనుమతి ఇచ్చాకే టెండర్లు నిర్వహించి, గుత్తేదారులకు పనులు అప్పగించే వీలుంటుంది. కానీ దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
• రాష్ట్రవాటా కింద రూ.1,016 కోట్లు సమకూర్చడం కష్టమేనని గతంలో ఆర్థికశాఖ అధికారులు.. ఆర్‌ అండ్‌ బీ అధికారుల వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది. మరోవైపు ఈ ప్రతిపాదనలు పంపి రెండేళ్లు అవుతుండటంతో.. అంచనా వ్యయాలు పెరిగిపోతాయని, దీంతో రాష్ట్ర వాటా మొత్తం కూడా పెరుగుతుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. మొదటి దశ పనులే నత్తనడకన సాగుతుండగా, ఇక రెండో దశకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
• మరోపక్క రాష్ట్రంలో గతంలో వేసిన రోడ్లకు సైతం బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం వేగంగా స్పందించలేదు. వేసిన అడపాదడపా రోడ్లకు కాంట్రాక్టర్లకు చాలా ఆలస్యంగా బిల్లలు చెల్లించారు. దీంతో పాటు వైసీపీ ప్రజా ప్రతినిధులు సైతం భారీగా క్షేత్రస్థాయిలో పర్సంటేజీలు అడుగుతుండటంతో పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని దౌర్భగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.
• ప్రతిపాదించిన 119 రోడ్ల నిర్మాణంలోనూ సీఎం సొంత జిల్లా కడపకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ 11 రోడ్లను బాగు చేయాలని ప్రతిపాదించారు. మొత్తంగా 121.62 కి.మీ. మేర బాగు చేయాలని, దీని కోసం రూ.321 కోట్లు అంచనాలు పంపినా అతీగతి లేదు. అత్యల్పంగా చిత్తూరు జిల్లాలో 5 రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపినా వాటికీ మోక్షం లభించలేదు.
• ప్రస్తుతం వర్షాలు జోరుగా పడుతున్న తరుణంలో పాత రోడ్లు మరింత దారుణంగా తయారయ్యాయి. జనసేన పార్టీ వరుస పోరాటాల తర్వాత రాష్ట్రంలోని గుంతల రహదారులకు చేసిన ప్యాచ్ వర్కులు సైతం పూర్తిగా పాడయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లు అయింది. ఇప్పుడు మరింత దారుణంగా రహదారులు కనిపిస్తున్నాయి.