మహిళలకు అండగా నిలుద్దాం – వారిని కాపాడుకుందాం: ఆళ్ళ హరి

గుంటూరు, రోజుకి సగటున తొమ్మిది మంది బాలికలు, 24 మంది మహిళలు అదృశ్యమైపోతున్నారని, రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన మొదటి వీరమహిళ రాజనాల నాగలక్ష్మిని పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ అసమర్ధ, అరాచక పాలనతో రాష్ట్రాన్ని ఆడబిడ్డలకు రక్షణ లేని ప్రాంతంగా మార్చారని విమర్శించారు. సీఎం నివాసం పక్కనే ఒక దళిత యువతిని గంజాయి మత్తులో ఒక యువకుడు దాడి చేసి చంపేశాడు అంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. వైసీపీ నేతలకు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని ఉద్యమించిన అమరావతి రైతులపై, పారిశుద్ధ్య కార్మికులపై, అంగన్వాడీ, ఆశావర్కర్లపై వైసీపీ సాగించిన పైశాచిక దాడిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మహిళలపై తమ పైశాచిక సామాజిక మాద్యమ సైన్యంతో జగన్ రెడ్డి మహిళల మానాభిమానాన్ని హరించే విధంగా దాడి చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మహిళలకు అండగా నిలవాలని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నరకాసురులకు నకళ్ళుగా మారిన ఈ వైసీపీ నేతల పీడను భరించే శక్తి ఆంధ్రావనికి ఇక లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతీ మహిళా ఒక దుర్గావతారం దాల్చి వైకాపా మహిషాసురగణాన్ని తమ ఓటుతో మధించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని, భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్ , సయ్యద్ షర్ఫుద్దీన్, నండూరి స్వామి, గిరి బాబాయ్, తేజా, సాయి తదితరులు పాల్గొన్నారు.