కేరళలో జూన్‌ 9 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను సీఎం పినరయి విజయన్‌ పొడగించారు. వైరస్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్నప్పటికీ ఆంక్షలను తొలగించే దశకు చేరుకోలేదని, ఈ నెల 31 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో మే 8న ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలులోకి తీసుకువచ్చింది. అనంతరం 16న, 23న మరోసారి పొడగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేసులు ఎక్కువగా ఉన్న మల్లప్పురం జిల్లాలో ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ను అమలు చేయగా.. ఉప సంహరిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

ఇతర జిల్లాలతో పాటు మల్లప్పురంలో సాధారణ లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు (టీపీఆర్‌) తిరువనంతపురంలో 20.21శాతం, పాలక్కాడ్‌లో 23.86 శాతంగా ఉందని.. మిగతా జిల్లాలో 20 శాతానికంటే తక్కుగానే ఉందని విజయన్‌ తెలిపారు. మలప్పురం జిల్లాలో టీపీఆర్ ఈ నెల 23న 31.53 శాతం ఉండగా.. ప్రస్తుతం 17.25 శాతానికి తగ్గింది. ఈ సందర్భంగా కొన్ని మినహాయింపులు ప్రకటించారు. పారిశ్రామిక సంస్థలు ఉద్యోగుల్లో 50 శాతం మించకుండా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

పారిశ్రామిక సంస్థలకు సరఫరా చేసే దుకాణాలు మంగళవారం, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటల వరకు.. సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. పుస్తకాలు, బట్టల, ఆభరణాలు, చెప్పుల దుకాణాలు సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు తెరచుకోవచ్చని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. జూన్‌ మొదటి వారంలో మరింత వ్యాక్సిన్‌ స్టాక్‌ అందుబాటులోకి వస్తుందని, లభ్యత మేరకు టీకా డ్రైవ్‌ను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. నిన్న కేరళలో 23,513 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.