ఏలూరు జనసేన కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

ఏలూరు, జగనన్న ఇళ్ల కాలనీల్లో అవినీతి కంపు కొడుతుందని, లక్షలాది రూపాయలు వెచ్చించి లబ్ధిదారుడు కట్టుకున్నా ఇంటిని తాను కట్టించినట్లుగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని బిల్డప్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులవివక్ష నిర్మూలనకు, అంటరానితనానికి వ్యతిరేకంగా, మహిళల విద్యావ్యాప్తికి, సమాజ ప్రగతికి పూలే చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నగరానికి దూరంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి పేద ప్రజలను ఎమ్మెల్యే ఆళ్ల నాని మోసగించాడని ధ్వజమెత్తారు. పోణంగి జగనన్న ఇళ్ల కాలనీలో ఒక లబ్ధిదారుడు తన కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఇంటిని నిర్మించుకుంటే తానే నిర్మించి ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యవహార శైలిని రెడ్డి అప్పలనాయుడు తప్పుపట్టారు. ప్రజలపై అంత అభిమానమే ఉంటే అక్రమంగా పోగేసిన అవినీతి డబ్బుతో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించారు. ప్రతి ఎకరానికి లక్షలాది రూపాయలు కమీషన్ తీసుకొని గృహ నిర్మాణాలకు పనికిరాని స్థలాలను కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లో 21 వేల 942 ఇళ్లకు గాను కేవలం 240 ఇల్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, ఆ నిర్మాణాలు కూడా లబ్ధిదారులే సొంత సొమ్ముతో నిర్మించుకున్నారని చెప్పారు. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షా 80 వేల రూపాయలు మినహా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారునికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. డ్వాక్రా మహిళల నుండి 35 వేల రూపాయలు చొప్పున వసూలు చేసి వారిని అప్పులపాలు చేశారని, ఇళ్ళను మాత్రం నిర్మించలేదన్నారు. జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మాణాలకు అనుకూలమైన పరిస్థితులు లేవని, చిన్నపాటి వర్షానికే జలమయం అవుతుందన్నారు. అడవులను తలపించే విధంగా ఇళ్ల కాలనీలు ఉన్నాయన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ల చేత నిర్మిస్తున్న ఇల్లు నాశరకంగా ఉన్నాయని, తుమ్మితే పడిపోయే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఐరన్ తుప్పు పట్టి పనికిరాకుండా పోతుందన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల నానిని మూడు సార్లు గెలిపించిన ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని, మళ్లీ మభ్య పెట్టేందుకు ఇంటింటికి వెళ్తున్నాడని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తే, ఏలూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఆళ్ల నాని నాశనం చేశారని ఆరోపించారు. ఏలూరు నియోజకవర్గంలో జరిగిన అవినీతిని కక్కిస్తామని, వచ్చే ఎన్నికల్లో దొంగలందరినీ ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ప్రోగ్రాం కమిటీ సభ్యులు బొండా రాము నాయుడు, పార్టీ నగర కార్యదర్శులు ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కన్వీనర్ జనసేన రవి, నాయకులు నూకల సాయి ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.