భారత అథ్లెట్ల గర్జన విమర్శకుల నోరు మూయిస్తుంది: మహేశ్ బాబు

త్వరలోనే జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈసారి విశ్వ క్రీడా సంరంభంలో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని మన అథ్లెట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో భారత అథ్లెట్లలో మరింత స్ఫూర్తి నింపేలా ప్రముఖ శీతలపానీయం బ్రాండ్ థమ్సప్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ తో ఓ వీడియో రూపొందించింది.

భజరంగ్ పునియా, మను బాకర్, వికాస్ వంటి అథ్లెట్లను ప్రోత్సహిస్తూ మహేశ్ బాబు గొంతుక నుంచి వచ్చిన తూటాల్లాంటి పలుకులు నిస్సందేహంగా ప్రేరణ కలిగిస్తాయనడంలో సందేహంలేదు. మీరేం సాధిస్తారని నిరాశకు గురిచేసే విమర్శకుల అభిప్రాయాలను తల్లకిందులు చేయండి అంటూ మహేశ్ బాబు పేరుపేరునా పిలుపునివ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత అథ్లెట్ల గర్జన వారి సామర్థ్యంపై వచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి నోరు మూయిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈసారి దేశాన్ని గర్వించేలా చేస్తారని పేర్కొన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.