నష్టపరిహార వివరాల సేకరణ, అందజేతలో పారదర్శకత పాటించండి

  • జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య

పాడేరు: మిచౌంగ్ తుఫాను కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ఉదారత చూపాలని జనసేన అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య కోరారు. నష్టపోయిన రైతుల వివరాల సేకరణలోనూ పరిహారం అందజేయడంలోనూ పారదర్శకత పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు వర్షాలు లేక అల్లూరి సీతారామరాజు జిల్లా యావత్తు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కరువు జిల్లాగా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు స్వపక్షాలు విన్నవించినా అల్లూరి సీతారామరాజు జిల్లా పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనికరం చూపకపోవడం దురదృష్టకరమన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వమని తరచూ చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి రెండు నెలలుగా రైతులు తమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కనీసం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజనులకు సమస్య వచ్చిన ప్రతిసారి ఈ ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కాస్తో కూస్తో పండిన పంటలు కూడా ఈ మిచౌంగ్ తుఫాను వల్ల రైతులు నష్టపోవాల్సి వచ్చిందని ఉన్న కొద్దిపాటి వరి, రాగులు, రాజ్ మా వంటి పంటలు పూర్తిగా నీటమునగడం, కొన్ని వరిచేలు కోసినవి పంట పొలాల్లోనే తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించడంలో అయినా సరే పారదర్శకత వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. నష్టం జరిగిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందేలా చూడాలని కోరారు. గిరిజనులలో చాలామంది రైతులు అవగాహన లేక ఈ క్రాఫ్ చేయించుకోలేని పరిస్థితిని ఉందని అందువలన ఈ క్రాఫ్ నమోదు నిబంధనను సడలించి వాస్తవంగా నష్టపోయిన వారిని గుర్తించి ప్రతి రైతునూ ఆదుకోవాలని కోరారు.