ఇండియాలో మోడెర్నా ట్రయల్స్‌..

మోడెర్నా సంస్థ తయారు చేసిన కోవిడ్ టీకాను భారత్‌లో ఆవిష్కరించేందుకు టాటా సంస్థ చర్యలు చేపట్టింది. సీఎస్ఐఆర్‌తో కలిసి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్‌.. ఇండియాలో మోడెర్నా టీకాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. మోడెర్నా సంస్థ మాత్రం దీనిపై స్పందించలేదు. భారత ప్రభుత్వం ఇటవలే రెండు కోవిడ్ టీకాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా చెందిన కోవీషీల్డ్‌, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాలను ఇండియాలో వాడుతున్నారు. భారత్‌లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో ఇప్పటికే 15 లక్షల మందికి టీకా వేశారు.

మోడెర్నా టీకాలను సాధారణ ఫ్రిడ్జ్‌లోనే నిల్వచేయవచ్చు. కోల్డ్ చైన్లు తక్కువగా ఉన్న ఇండియా లాంటి దేశాల్లో మోడెర్నా టీకాల వినియోగం మెరుగ్గానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మోడెర్నా టీకా 94.1 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని గత నవంబర్‌లో స్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో గత డిసెంబర్ నుంచి మోడెర్నా టీకాను వినియోగిస్తున్నారు. యూరోప్‌లోనూ ఈ నెల నుంచి వాడుతున్నారు. వ్యాక్సిన్ తయారీదారులు కచ్చితంగా తమ దేశంలో ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఆయా వ్యాక్సిన్లకు అనుమతి దక్కుతుందని ఇటీవల భారత్ నిర్దేశించింది.