నాదెండ్ల అరెస్టు అప్రజాస్వామికం: గంగారపు స్వాతి

వైసిపి ప్రజాప్రతినిధుల స్వార్ధ ప్రయోజనాలకు విశాఖపట్నం టైకూన్ కూడలి మూసి వేసిన ప్రజలను ఇబ్బందులకు గరి చేయడం తగదని, శాంతి యుతంగా నిరసనకు విచ్చేసిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమంటూ ఆ పార్టీ మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జి గంగారపు స్వాతి ఆరోపించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖపట్నంలోని టైకూన్ కూడలిని ఆ ప్రాంత ఎంపీ సత్యనారాయణ తన స్వార్థ ప్రయోజనాల కోసం నెలరోజులుగా మూయించారన్నారు. దాంతో వాహన రాకపోకలు స్తంభించి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అయితే కూడలిని తెరిపించే క్రమంలో నాదెండ్ల మనోహర్ సోమవారం నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తుండగా, స్థానిక పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని సమీపంలోని హోటల్ లో నిర్బంధించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు ఉందన్నారు. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. మనోహర్ ను బేషరతుగా విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, రహదారులను మూసి వేయించడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. కూడలి మూతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనసేన పోరాటం చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించి..నాదెండ్ల మనోహర్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే జనసేన కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ,నవాజ్, లవన్న, పవన్ శంకర, జనార్దన్, కార్తీక్, దినకర్ తదితరులు పాల్గొన్నారు.