మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. కేరళలోనే సగానికి పైగా..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం.. 27,176 కొత్త కేసులు, 284 మరణాలు సంభవించాయి. క్రితం రోజుతో పోల్చితే రోజువారీ కేసుల్లో 7 శాతం పెరుగుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కేసుల సంఖ్య 30 వేలకు దిగువనే నమోదైంది. కేరళలో 15,876, మహారాష్ట్రలో 3,530 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూస్తుండటం గమనార్హం.

ఇప్పటివరకు 3.33 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.25 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 38,012 మంది కొవిడ్‌ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3.51లక్షల మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 97.62 శాతానికి పెరగ్గా.. క్రియాశీల రేటు 1.05 శాతానికి తగ్గింది. మృతుల సంఖ్య 4,43,497కి చేరింది.

మరోపక్క నిన్న 61,15,690 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 75,89,12,277కి చేరింది.