తెలంగాణలో కొత్త కరోనా వైరస్ టెన్షన్.. యూకే నుంచి 358 మంది

బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూడడం కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిన్న యూకే నుంచి ఏడుగురు ప్రయాణికులు రాగా, వారం రోజుల్లో 358 మంది రాష్ట్రానికి వచ్చారని తెలంగాణ రాష్ర్ట ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 12వందల మంది యూకేకు వెళ్లివచ్చినవాళ్లుగా అధికారులు గుర్తించగా.. వారిని ఆస్పత్రులకు తరలిస్తు.. వారిలో కొత్త వైరస్ లక్షణాలు లేకపోయినా వారం రోజుల పాటు పరిశీలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని శ్రీనివాస్ తెలిపారు. యూకే నుంచి రాష్ర్టానికి వచ్చిన వారు ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా తెలుపాలన్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో కరోనా నెగిటివ్ వచ్చినా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు.

కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొత్త వైరస్‌తో ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ధ్రువీకరణ లేదన్నారు. ఈ వైరస్‌లో తీవ్ర లక్షణాలు కూడా స్వల్పంగా ఉన్నాయన్నారు. కొత్త రకం కరోనా వైరస్‌పై అన్ని శాఖలను అప్రమత్తం చేశాం. రాష్ర్టంలో ఇప్పటి వరకు కొత్త వైరస్ లేదన్నారు. పండుగలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యుల మధ్యే పండుగలు జరుపుకోవాలని డాక్టర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.