జనతాదళ్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న నితీష్ కుమార్..

జనతాదళ్(యూ) అధ్యక్ష పదవి నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్ తప్పుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రాజ్యసభ సభ్యులు రామచంద్ర ప్రసాద్ సింగ్ కొత్త అధ్యక్షునిగా ఎంపికయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2019లో జేడీయూ అధ్యక్షుడుగా తిరిగి ఎంపికయ్యారు. అయితే, ఆయన పదవీకాలం మూడేళ్లూ పూర్తవడంతో ఈసారి ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో నూతన అధ్యక్షుడిగా రాంచంద్ర ప్రసాద్ సింగ్‌కు ఆ పదవి కట్టబెట్టారు. ఆదివారం జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దీనిపై చర్చించారు. అనంతరం అధ్యక్ష పదవికి బ్యూరోక్రాట్ అయిన ఆర్సీపీ సింగ్‌ను ప్రతిపాదించారు. పార్టీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఆయన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్సీపీ సింగ్ ప్రస్తుతం జేడీయూ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తగిన సీట్లు గెలవలేకపోవడంతో జనతాదళ్ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు బీజేపీలో చేరడం పార్టీకి ఇబ్బందికరంగా మారిన నేపధ్యంలో పార్టీ ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ మేరకు అధ్యక్ష బాధ్యతల నుండి నితీష్ తప్పుకుని తన స్థానంలో కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు.