ఫేక్ కరోనా సర్టిఫికెట్‌ సమర్పించిన బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

కోర్టు విచారణ నుండి తప్పించుకొనే నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఫేక్ కరోనా రిపోర్ట్‌ను సృష్టించి అడ్డంగా బుక్కయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాగెల్‌కు వ్యతిరేకంగా 2010లో నమోదైన హత్యాయత్నం, ప్రజా ఆస్తికి నష్టం కేసులో కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు తనకు కరోనా పాజిటివ్‌ అని నకిలీ సర్టిఫికెట్‌ను ఆయన సృష్టించారు. సంత్ కబీర్ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్‌ హర్‌గోవింద్‌ సింగ్‌ దానిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే రాకేశ్‌ సింగ్‌ హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

అయితే ఎమ్మెల్యే తన ఇంట్లో లేరని, ఫోన్‌లో అందుబాటులోకి రాలేదని హామ్‌ ఐసొలేషన్‌ను తనిఖీ చేసే బృందానికి చెందిన డాక్టర్‌ వివేక్‌ కుమార్‌ శ్రీవాస్తవ కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బాగెల్, డాక్టర్ హర్‌గోవింద్‌ సింగ్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, మోసం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.