నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్: జ‌నసేన రాయ‌ల్ సోల్జ‌ర్స్

కారణజన్ముడు, భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయులు బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ అని జ‌న‌సైనికులు కొనియాడారు. సోమ‌వారం అంబేద్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా జ‌నసేన రాయ‌ల్ సోల్జ‌ర్స్ కార్యాల‌యంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా జేఎస్పీ రాయ‌ల్ సోల్జ‌ర్స్ అధ్య‌క్షుడు అన్న‌దాసు వెంక‌ట సుబ్బారావు మాట్లాడుతూ ఆ దీనజనోద్ధారునికి భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తున్నామ‌ని తెలిపారు. తాము ఆరాధించే గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ అని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయమ‌ని అన్నారు. దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ ఆద్యులుగా చెప్పుకోవడం మనకు గర్వకారణమ‌న్నారు. రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయన్నారు. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను ముందే పసిగట్టి ప్రజలకు ఇటువంటి రక్షా బంధనం రూపొందించారేమోనని ప్రస్తుత పరిస్థితులలో అనిపించకమానదన్నారు. భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావిగా, మానవతా విలువలు మూర్తీభవించిన మహా మనిషిగా ప్రపంచం కొనియాడిన అంబేద్కర్ చూపిన మార్గంలోనే తాము న‌డుస్తున్నామ‌ని చెప్ప‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాకనాటి రమాదేవి, బండారు రవీంద్ర, సూదా నాగరాజు, సూరిశెట్టి ఉపేంద్ర, పాములూరి కోటేశ్వర రావు, బొడ్డుపల్లి రాధాకృష్ణ, బావిరెడ్డి రవికిషోర్, ఇమడాబత్తుని సాయి సుప్రజ, మొఖమాటం సతీష్, వురుబండి లెనిన్, గుండ్రెడ్డి ఆంజనేయులు, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.