ఎవరెన్ని కుట్రలు చేసినా జనసేనాని వెంటే నా ప్రయాణం: గుడివాక శేషుబాబు

అవనిగడ్డ: జనసేన పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది తనపై దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టించి తమను జైలుకు పంపించారని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు అన్నారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబసభ్యుల మధ్య జరిగిన చిన్న గొడవను కొందరు వేరే విధంగా చిత్రీకరించి తనపై, తన కార్యకర్తలపై కేసులు పెట్టించారని, తమపై ఎవరెన్ని కుట్రలు చేసినా జనసేనాని పవన్ కళ్యాణ్ వెంటే తమ ప్రయాణమని అన్నారు. గత శుక్రవారం తమకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణిదెల నాగేంద్రబాబు అపాయింట్మెంట్ లభించడంతో, తనను నాగేంద్రబాబుతో కలవనీయకుండా చేయడానికి మాత్రమే కుటుంబసభ్యుల మధ్య జరిగిన గోడవను కేసులు పెట్టించి తమను దోషులుగా నిలబెట్టాలని చూశారని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత ఆశయాలతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, జనసేన పార్టీలో చేరి ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ, నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా “గుడివాక శేషుబాబు అనే వ్యక్తిని అణగదొక్కడానికి చేసే ప్రయత్నాలు మానుకుని, ప్రజల సమస్యలపై పోరాటం చేసి నాయకులుగా ఎదగాలని, జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసేంతవరకు అందరూ సమిష్టిగా కృషిచేయాలని” జనసేన నేతలకు హితవు పలికారు.

ఉచిత వైద్య శిబిరాన్ని జయప్రదం చేయండి

డిసెంబర్ 24 ఆదివారం అవనిగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనిగడ్డ ఎస్.వి.ఎల్ కాలేజి ఆవరణలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని జనసేన కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు విజయశ్రీ హాస్పిటల్ వారి వైద్యబృందం అవనిగడ్డ కు విచ్చేసి, వైద్య శిబిరంలో పాల్గొంటారని, ఎముకలు, నరాల సంబంధిత వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు తదితర విభాగాలకు చెందిన వైద్యులు రానున్నారని, కావున అవనిగడ్డ మండల ప్రజలు ఈ కార్యక్రమంను వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, తుంగల నరేష్, గుడివాక రామాంజనేయులు, కోసూరి అవినాష్, వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ, పప్పు శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.