స్టార్ డైరెక్టర్ శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

రజనీకాంత్  హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘రోబో’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ‘రోబో’ చిత్ర కథ తనదే అంటూ అప్పట్లో ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. ‘జిగుబా’ కథ 1996లో ఓ పత్రికలో ప్రచురితం కాగా, 2007లో నవల రూపంలో వచ్చింది.

కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు స్పష్టం చేసినా శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు వారెంట్ జారీ చేసిన చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.