అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులను వెంటనే తొలగించాలి

నెల్లూరు, అధికార పార్టీ అండతో సిండికేట్ గా ఏర్పడి ఎండీఎల్ లైసెన్స్ దారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్న వారితో పాటు, వారికి సహకరిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. మైనింగ్ అధికారుల అండదండలతో మైనింగ్ సిండికేట్ మాఫీయా చేస్తున్న అరాచకాల నుంచి కాపాడుకునేందుకుకు జనసేన పార్టీ మద్దతు కావాలని మినరల్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం జనసేన పార్టీ నాయకులకు వినతిపత్రం అందజేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 100 మందికి క్వార్జ్ మరియు ఫాల్స్పర్ మైన్స్ లకు అనుమతులు మంజూరు చేసి ఉండగా సిండికేట్ మాఫీయా ప్రోద్బలంతో అధికారులు కేవలం ఐదు, ఆరు మంది మాత్రమే వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చి మిగిలిన వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బ్లాక్ చేయడం జరిగిందన్నారు. లోడుతో వెళుతున్న వాహనలను సిండికేట్ పేరుతో ప్రయివేటు వ్యక్తులు ఆపి అక్రమంగా జె టాక్స్ పేరిట వసూళ్లు చేస్తున్నారని, ప్రశ్నిస్తే దాడులకు దిగబడడం దారుణమన్నారు. జె మాఫియా చేస్తున్న అక్రమాల పై చర్యలు తీసుకోవాలని మైనింగ్ డీడీ, డీఓఏం, జిల్లా కలెక్టర్ కి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ఖాతరు చేయకుండా సిండికేట్ మాఫీయా కు అండగా అధికారులు నిలవడం సిగ్గు చేటన్నారు. మైనింగ్ మాఫియా కు అండగా ఉన్న అధికారులపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు ఏండీఎల్ అసోసియేషన్ న్యాయంగా వ్యాపారం చేసుకునేందుకు జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.