షారుక్‌ఖాన్‌ ఇంట్లో అతిథిగా ఉండే అవకాశం

బాలీవుడ్ బాద్షా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఫాన్స్ అంతా తాము ఎంతగానో ఆరాధించే సినీ నటులను ఒక్కసారైనా కలవాలని వాళ్లతో కనీసం ఒక్క సెల్ఫీ అయినా తీసుకుంటే చాలని భావిస్తుంటారు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఆ సెల్ఫీని చూసి ఎంతో మురిసిపోతుంటారు. మరి సెల్ఫీతో సరిపెట్టకుండా.. నేరుగా అభిమాన నటుడి ఇంటికి వెళ్లి అక్కడే ఒకరోజు అతిథిగా ఉండే అవకాశం వస్తే.. కలలో కూడా ఇలాంటి ఆలోచన రాదేమో కదా..! కానీ.. అలాంటి అవకాశం షారుక్‌ అభిమానులకు వచ్చింది. అతిథుల రాకకోసం దిల్లీలో ఉన్న తమ ఇంటిని షారుఖ్‌ భార్య గౌరీఖాన్‌ అందంగా తీర్చిదిద్దింది కూడా. ఈమేరకు కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు కూడా చేశాడు. ఇంటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఆయన పంచుకున్నాడు. ఇంతకీ షారుక్‌ ఇంటికి వెళ్లడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? ‘ఎయిర్‌బీఎన్‌బీ’ అనే అమెరికన్‌ వెకేషన్‌ రెంట్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థ ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.

‘గౌరీని నేను తొలిసారిగా కలిసింది కూడా దిల్లీలోనే. రాజధాని నగరం మా హృదయాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది’ అని షారుఖ్‌ ఆ పోస్టు చేశాడు. ‘నా భార్య గౌరీఖాన్‌ మా ఇంటిని ఎంతో అందంగా అలంకరించింది. ప్రేమ, జ్ఞాపకాలతో ఆమె ఇల్లంతా నింపేసింది. మీరు అతిథిగా మారి మాఇంటికి వచ్చే అవకాశం ఎయిర్‌బీఎన్‌బీ కల్పిస్తోంది’ అని అన్నాడు. ఆసక్తి ఉన్నవారు నవంబర్‌ 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని ఎయిర్‌బీఎన్‌బీ సంస్థ పేర్కొంది.