ప్రపంచ ఖ్యాతి సాధించిన మన రామప్ప

రాళ్లలో పూలు పూయించిన అలనాటి శిల్పి అపురూప కళాఖండమైన రామప్ప అస్తిత్వం నేడు అంతర్జాతీయంగా వైభవోపేతమై ఎన్నో ఎళ్ల కల సాకారమైంది. 2020 సంవత్సరానికి గాను రామప్ప దేవాలయానికి ప్రపంచ స్థాయి కట్టంగా యునెస్కో గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు, పాలంపేట గ్రామంలో కొలువైన ఈ ప్రఖ్యాత ఆలయం తాజ్‌మహల్‌, ఎర్రకోట వంటి కట్టడాల సరసన సగర్వంగా నిలిచింది. చైనాలో జరిగిన యునెస్కో సమావేశంలో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌ వెల్లడించారు.

ఈ నెల 16 నుంచి 44వ యునెస్కో హెరిటేజ్‌ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం జరిగిన ఓటింగ్‌ ప్రక్రియ, చర్చలో భాగంగా రామప్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అవన్నీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నవే. కానీ రామప్ప ఆలయానికి భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర ఎన్నో అద్భుతమైన అర్హతలు ఉండటంతో యునెస్కో గుర్తింపును పొందింది.

భారత్ వ్యహాత్మకంగా దౌత్యం ద్వారా రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కింది. ఈ ప్రక్రియలో రష్యా మనకు అండగా నిలిచింది. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి 2019లోనే నామినేషన్‌ దాఖలైంది. చైనాలోని ఫుఝౌ వేదికగా ఆదివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన డబ్ల్యూహెచ్‌సీ సమావేశంలో ఐసీవోఎంవోఎస్‌ మళ్లీ రామప్ప నామినేషన్‌ పరిశీలనను వాయిదా వేయాలని మోకాలడ్డింది.

ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయిలాండ్‌, హంగేరీ, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాలు మన దేశానికి మద్దతుగా నిలిచాయి. నార్వే మాత్రం వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అయితే 17 దేశాలు భారత్‌కు అండగా నిలవడంతో ఎట్టకేలకు రామప్పకు ప్రపంచ కట్టడంగా గుర్తింపు దక్కింది. గత ఏడాదే రామప్పకు యునెస్కో గుర్తింపునివ్వడంపై చర్చ జరగాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా డబ్ల్యూహెచ్‌సీ సమావేశం ఆలస్యమైంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కిన మొదటి కట్టడంగా రామప్ప నిలిచింది. మన దేశంలో ఇప్పటివరకు 38 ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు ఇచ్చింది. వాటిలో 30 వారసత్వ కట్టడాలు కాగా, ఏడు సహజ వింతలు, ఒకటి చరిత్ర, 39వ కట్టడంగా రామప్ప నిలిచింది. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి.