పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ అస్తమయం

ప్రముఖ కలంకారీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి (84) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జొన్నలగడ్డ 1937 మార్చి 15న లక్ష్మయ్య, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించారు. వృత్తిరీత్యా ఆయన తెలుగు ఉపాధ్యాయుడైనా కలంకారీపై మక్కువతో దాన్నే ప్రవృత్తిగా ఎంచుకున్నారు. కలంకారీ విద్యలో అనేక రూపాలు ప్రతిష్టించి జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించారు. రామాయణ, భారత, భాగవతాలలోని కథా వస్తువులను 120 నమూనాలుగా చిత్రీకరించడం జొన్నలగడ్డ ప్రత్యేకత. కలంకారీ విద్యలో ఆయన చూపిన ప్రతిభ, సేవకుగానూ భారత ప్రభుత్వం ఆయనను 2008లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. 1976లో భారత ప్రభుత్వం కళాతోరణం బిరుదుతో సత్కరించింది. 2002లో శిల్పగురు అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా విదేశాల్లో సైతం కలంకారీపై ఆయన ప్రసంగాలు చేశారు.

కలంకారీ విద్యపై ఓ పుస్తకం కూడా రాశారు. శ్రీకాళహస్తి కళల కాణాచిగా జాతీయ ఖ్యాతి సాధించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో పాటు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.