ఏపీలో పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరమిలా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణ అంశం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఉండటంతో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అవాంతరం ఏర్పడింది. దాంతో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి నేటి నుంచే మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు మొదలవ్వాల్సి ఉండగా.. రీషెడ్యూల్ ప్రకారం దానిని ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు.

రీషెడ్యూల్ ప్రకారం.. రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. ఇక మూడో దశను రెండో దశగా.. నాలుగో దశను మూడో దశగా.. మొదటి దశను నాలుగో దశగా ఎస్ఈసీ మార్చారు. దాని ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిచంనున్నట్లు ప్రకటించారు. ఈ రీషెడ్యూల్‌ వివరాలను జిల్లాల కలెక్టర్లకు ఎస్ఈసీ పంపించారు. మరికాసేపట్లో ఈ అంశంపై జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అవుతారని సమాచారం. కాగా, సుప్రీంకోర్టులో సైతం చుక్కెదురు అవడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే కార్యరంగంలోకి దిగింది.