Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న వరుస పతకాలతో దుమ్మురేపి ఒకే రోజు మూడు పతకాలు అందించారు. తాజాగా, నేడు భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. ఫలితంగా 2016 రియో గేమ్స్ పతకాల రికార్డు సమమైంది.

 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అవని లేఖర 249.6 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా డిసెంబరు 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఇరీనా షెట్నిక్ నమోదు చేసిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. టోక్యోలో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా, పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా అవని రికార్డులకెక్కింది. మొత్తంగా స్వర్ణం సాధించిన ఐదో మహిళగా చరిత్ర సృష్టించింది.