3వ రోజుకు చేరుకున్న పాటంశెట్టి ఆమరణ నిరాహార దీక్ష

జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనం ఇచ్చే విషయంలో అవకతవకలు ఉన్నాయని వాటిని పరిష్కరించి ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారానికి 3వ రోజుకు చేరుకుంది. ఈ విషయంపై గ్రామ ప్రజలందరి తరుపున సూర్యచంద్రతో మాట్లాడడానికి డి.డబ్ల్యు.ఏ.ఎం.ఏ పిడి అడపా వెంకటలక్ష్మి, జగ్గంపేట ఎమ్మార్వో, ఎంపిడిఓ, సి.ఐ, ఎస్.ఐ మరియు సంబంధిత అధికారులు గురువారం మధ్యాహ్నం వెంగయ్యమ్మపురం గ్రామం రావడం జరిగింది. ఈ క్రమంలో డి.డబ్ల్యు.ఏ.ఎం.ఏ పిడి అడపా వెంకటలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని మా అధికారులు దృష్టికి తీసుకుని వచ్చారని ఆ విషయాలపై సోమవారం విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి ఉపాధి హామీ కూలీలకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు. దీనికి గ్రామ ప్రజలు అంగీకరించకుండా వెంటనే చర్యలు తీసుకుని సమంబందిత ఫీల్డ్ అసిస్టెంటును, టెక్నికల్ అసిస్టెంటును విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చెమటోడ్చి కష్టపడి పనిచేసే మాకు వారానికి 600 రూపాయలు ఇచ్చి, ఏ పని చేయకుండా ఇళ్లలో కూర్చునే వారికి 1550 రూపాయలు ఇస్తున్నారని ఇదంతా స్థానికంగా ఉన్న నాయకులు, అధికారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని వచ్చిన అధికారులకు చెప్పి వాపోయారు. ఇదిలా ఉండగా శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పాటంశెట్టి సూర్యచంద్ర గారిని అక్కడకు వచ్చిన పోలీసు అధికారులు దౌర్జన్యంగా దీక్షను భగ్నం చేసి బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయగా దానిని గ్రామస్థులు అంతా చాలా బలంగా త్రిప్పి కొట్టడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసిస్తూ సూర్యచంద్ర గారు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షతో పాటు తను కూడా నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని వారి భార్య శ్రీదేవి గారు తెలిపారు. అనంతరం సాయంత్రం స్థానిక పి.హెచ్.సి నుండి వైద్య బృందం వచ్చి వారికి ఆరోగ్య పరీక్షలు చేసి భార్యా, భర్తలు ఇద్దరికీ కూడా ఆరోగ్యం క్షీణిస్తుందనీ వీలైనంత తొందరగా వారికి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని తెలిపారు. వేరే జిల్లాలో కొన్ని కార్యక్రమాల పర్యటనలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ కి ఈ విషయం తెలియగానే వెంటనే వెంగయ్యమ్మపురం గ్రామం చేరుకుని పాటంశెట్టి సూర్యచంద్ర చేస్తున్న ఈ న్యాయపరమైన ప్రజా పోరాటానికి మద్దతు తెలిపి ఈ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి వారి ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి మీరు చేస్తున్న ఈ ప్రజా పోరాటానికి న్యాయం జరిగేలా చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.