మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్‌, వకీల్ సాబ్ నిర్మాతలు, అల్లు అర్జున్, రామ్ చరణ్

కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్‌, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్‌ షాక్‌తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగా హీరోలు పవన్ కళ్యాణ్‌, చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు పవన్. ఇక వకీల్ సాబ్ నిర్మాతలు, పవన్ 27వ సినిమా నిర్మాతలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు.

అల్లు అర్జున్ కూడా ఈ ప్రమాధంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మరణించిన వారికి సంతాపం తెలియజేసిన బన్నీ, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తమపై చూపిస్తున్న ప్రేమకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక రామ్ చరణ్ ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తన ట్వీట్‌లో తెలిపారు. మరణించిన వారిని తిరిగి తీసుకురాలేము. ఇలాంటి సమయంలో వారి కుటుంబాలని ఆదుకునేందుకు నా వంతుగా ఈ సాయం చేస్తున్నాను అని చరణ్ పేర్కొన్నారు.