మీ ప్రేమాభిమానాలు మరింత బాధ్యతను పెంచాయి: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకొనేందుకు మనసు సిద్దంగా లేదన్నారు. ఈ సారి బర్త్ డే పై ముందు నుండీ చేసుకోబోనని ప్రకటించారు. కానీ అభిమానులు మాత్రం సెలబ్రేట్ చేశారు. నేతలు/ తారలు పవన్ కల్యాణ్‌కు విష్ చేశారు. బర్త్ డే సందర్బంగా విష్ చేసిన వారికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

కరోనా మహమ్మారితో ప్రజలు వణికిపోతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చేతి వృత్తుల నుంచి కూలీలు, కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు ఆర్థికంగా చితికిపోన్నారని వెల్లడించారు. కరోనా వైరస్‌పై తొలి నుంచి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది, వివిధ రంగాల ఉద్యోగులు ప్రాణాలు ఫణంగా పెట్టడంతో చనిపోతున్నారని తెలిపారు. వారి కోసం చాతుర్మాస్య దీక్ష చేపట్టానని పవన్ కల్యాణ్ వివరించారు.

చాతుర్మాస్య దీక్ష ఏటా చేస్తానని.. కానీ ఈ సారి.. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే తన పుట్టినరోజు వచ్చిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. పరిస్థితుల దృష్ట్యా శుభాకాంక్షలు స్వీకరించడానికి మనసు సన్నద్ధంగా లేదన్నారు. బంధువులు, సన్నిహితులు, సినీ తారలు, అభిమానులు, జనసైనికులు అభిమానంతో శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలను పవన్ కల్యాణ్ తెలిపారు. మీ అందరి ప్రేమాభిమానాలు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ తొలగి సాధారణ పరిస్థితి ఏర్పడాలని కోరారు.