విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు హాజరవుతున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31వ తేదీన విశాఖకు రానున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సభకు పవన్ హాజరుకానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కొంచెం సేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. జనసేన పార్టీ ప్రజాపక్షం వహిస్తుందని.. ఎవరికీ భయపడేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న మరోసారి పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ తోపాటు నాదెండ్ల మనోహర్ పాల్గొని విశాఖ పర్యటన అంశాలపైనా చర్చించారు. విశాఖ ఉక్కు కార్మికులకు పార్టీ తరపున అండదండలు అందిచాలని నిర్ణయించినట్టు పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారని తెలిపారు. మరోవైపు, ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా ఆందోళనలను తీవ్రతరం అవుతున్నాయి.

ఇక, కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 256వ రోజు కూడా కొనసాగుతున్నాయి. దీక్షలలో సింటర్‌ ప్లాంట్‌ కార్మికులు పాల్గొన్నారు. బొగ్గు గనుల నిక్షేపాలను రానున్న నాలుగేళ్లలో విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను కార్మికులు తప్పుబట్టారు. బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సింటర్ ప్లాంట్ కార్మికులు వివరించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో చైర్మన్‌ డి.ఆదినారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్మాగారం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు నేటికీ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఇక, పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం ప్రభుత్వ రంగంలోనే ఉంటుందన్నారు. పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.