జానపద కళాకారుడు పెంచల్ దాస్, గో సంరక్షకుడు చాంద్ భాషాలను సత్కరించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జానపద గీతాలన్నా, జానపద సాహిత్యమన్నా ఎంతో మక్కువ చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రముఖ జానపద గాయకుడు, రచయిత పెంచల్ దాస్ ను సత్కరించారు. ఇవాళ పెంచల్ దాస్ హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిశారు.

పెంచల్ దాస్ ను సాదరంగా స్వాగతించిన పవన్… ఆయనతో జానపదాలపై ముచ్చటించారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకుడు, పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పెంచల్ దాస్ రాయలసీమ ప్రాంత జానపదాలను, ఆ ప్రాంతపు మాండలికాన్ని నేటి తరానికి చేరువ చేస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఇక, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామానికి చెందిన గో సంరక్షకుడు చాంద్ భాషాను కూడా పవన్ సత్కరించారు. చాంద్ భాషా దాదాపు 400 గోవులతో గోశాలను నిర్వహిస్తుండడం గురించి తెలుసుకున్న పవన్ వెంటనే ఆయన్ను హైదరాబాద్ పిలిపించారు. పవన్ తనను సత్కరించడం పట్ల చాంద్ భాషా సంతోషం వ్యక్తం చేశారు. గోశాలకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని మాటిచ్చారని వెల్లడించారు.