అమరావతి రైతులకు మద్దతుగా పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతికి తన మద్దతును మరోసారి ప్రకటించారు. రెండు రోజుల పార్టీ సమావేశాల కోసం విజయవాడ వెళ్లిన పవన్ కల్యాణ్.. మంగళవారం సాయంత్రం మంగళగిరి జనసేన కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు, దళిత జేఏసీ సభ్యులు ఆయనతో సమావేశమయారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని బీజేపీ కూడా కోరుకుంటోంది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా చెప్పింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ మేరకు తీర్మానం చేసింది. మేం ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కావడానికి ముందే ఆ తీర్మానం చేశారు’ అని చెప్పారు. రైతులు ఆడపడుచుల కన్నీళ్లు పాలకులను దహించివేస్తాయని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని ఆడపడుచులే ముందుకు తీసుకెళ్లాలని.. వారికి జనసేన అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌రెడ్డి అప్పుడే ఇష్టంలేదని చెప్పి ఉంటే.. రైతులు భూములివ్వడానికి ఇష్టపడేవారు కాదన్నారు. ‘అప్పుడేమో ఆయన అసెంబ్లీ సాక్షిగా అమరావతికి ఒప్పుకొని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులనడం సరైన పద్ధతి కాదు. అప్పుడు లేని కులం ఇప్పుడు ఎందుకొచ్చింది? రాజధాని ప్రాంతంలో ఒకే కులానికి చెందినవారు మాత్రమే ఉంటే ఆనాడే వ్యతిరేకించాల్సింది’ అని అన్నారు. దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను దళితులపైనే ఉపయోగించి వారి చేతికే సంకెళ్లు వేసి.. ప్రభుత్వం తన స్థాయిని దిగజార్చుకుందని విమర్శించారు. దళితులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశాం. కానీ రోడ్ల కోసం ఊళ్లను తీసేయడం చూడలేదు’ అని ఓ రైతు గతంలో అన్న మాట ఇప్పటికీ తనను కలచివేస్తోందన్నారు. అమరావతి రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదనను తెలియజేశారు. ‘కన్న బిడ్డలకు భూములిచ్చేందుకే ఏళ్ల తరబడి ఆలోచించే పరిస్థితుల్లో రాజధాని కోసం ఇచ్చినందుకు మేం రోడ్డెక్కాలా? ప్రభుత్వం దిగిరావాలంటే పవన్‌ లాంటి నాయకుడి అవసరముంది. 29 వేల మంది రైతుల ఉసురు జగన్‌కు తగిలి తీరుతుంది’ అని అన్నారు.