జనసేనకు చిరంజీవి ఆశీర్వాదంపై పెంటేల బాలాజి హ‌ర్షం

చిల‌క‌లూరిపేట‌, నీ వెనుక నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆయన అన్న, మెగాస్థార్ చిరంజీవి అభయం ఇవ్వ‌డం జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు అంతులేని సంతోషాన్ని, వెయ్యిరెట్ల బ‌లాన్ని ఇచ్చింద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను విజయోస్తు.. విజయీభవ అంటూ ఆశీర్వదించి, ఆ పార్టీ విజయాన్ని ఆకాంక్షించారని, పరోక్షంగా జనసేనకు మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. నా తమ్ముడు ఎలాంటి సత్కార్యం తలపెట్టినా నా ఆశీస్సులు ఉంటాయి. తను వేసే ప్రతి అడుగూ విజయం దిశగానే సాగాలని కోరుకుంటున్నా అని చిరంజీవి వాఖ్యానించ‌టం రాష్ట్ర రాజకీయాల్లో ఇదో ముఖ్యపరిణామంగా మారిందన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పవన్‌కల్యాణ్‌ ఆ పార్టీ యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగానూ వ్యవహరించి, క‌ల‌సి ప‌నిచేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.
అనధికారిక విద్యుత్‌ కోతల లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి పెరుగుతున్న ఎండ‌ల‌కు తోడు రాష్ట్రంలో అన‌ధికారిక విద్యుత్ కోత‌లు మొద‌ల‌య్యాయ‌ని బాలాజి తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా తీవ్ర త‌రం అయ్యే అవ‌కాశం ఉంద‌ని, ఈ క్ర‌మంలో విద్యుత్ కోత‌లు పెర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఇప్ప‌టికే విద్యుత్ కోత‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, గ్రామీణ ప్రాంతాల‌తో పాటు, మున్సిపాలిటీల‌లో సైతం అక్ర‌ప‌టిత విద్యుత్ కోత‌లు అమ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌లో ప్రభుత్వం 2 గంటలపాటు కోతలు పెట్టింద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. సోమవారం కొన్ని ఫీడర్ల పరిధిలో 10 గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం ప‌డుతుంద‌న్నారు. అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే రానున్న రోజుల్లో ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారే అవ‌కాశం ఉంద‌న్నారు. పెరిగిన ఎండ‌ల‌కు తోడు విద్యుత్ కోత‌లు కూడా మొద‌లైతే ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డతాయ‌ని హెచ్చ‌రించారు.