జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు సిద్ధం

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: జగన్‌ ‘సిద్ధం’ అని చెప్పడం కాదని, ఆయన్ను దించేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. ఆదివారం జీఎస్ఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ లేనివి ఉన్నట్టు తడబడకుండా అబద్ధాలు చెప్పుతున్నారని ఎద్దెవా చేశారు
జగన్‌ను ఓడించేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ బటన్‌ నొక్కుతూ ఏటా కోట్లాది రూపాయలను దోచేస్తున్నారని విమర్శించారు. జగన్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.
విజయమ్మ ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, వివేకానంద బలైనట్టు బలి చేస్తారన్న అనుమానాలు వున్నాయన్నారు. కేంద్రం విజయమ్మకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల క్షేత్రంలో మహాభారత యుద్దమంటూ స్క్రిప్ట్ చదివిన జగన్ దుర్యోధనుడని విమర్శించారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు లేకుండా చేశారని ఆరోపించారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం నిర్మాణం లాంటి హామీలేవీ నెరవేర్చలేదన్నారు. తండ్రి ఫొటో చూపి ఓటేయాలని అడుక్కొని, అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ ఫొటో పక్కన జగన్ ఫొటో పెట్టారని, తరువాత వైఎస్ఆర్ బొమ్మ ని పూర్తిగా మాయం చేసి పథకాలకు జగన్ పేరు పెట్టుకోవడం శోచనీయమన్నారు.
రెడ్డి సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టపెట్టి, మిగిలిన కులాల నాయకులకు అన్యాయం చేశారన్నారు. జగన్ బీసీలను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. జగన్ కు నిజంగా బీసీలపై ప్రేమ వుంటే విజయనగరంలో బీసీలకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విజయనగరం నియోజకవర్గం బీసీలకు కేటాయించే దమ్ముందా అని సవాల్ చేశారు. జగన్ పరిపాలన దరిద్రంగా వుందని, కాబట్టే ఏ పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. అభివృద్ధి పేరుతో వైకాపా పాలకులు దోచుకోవడం దారుణమన్నారు. గుంకలాంలో ఇళ్లులో భారీ స్కాం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే బినామీ పేర్లతో దోచుకున్నారని ఆరోపించారు. ఇతర మతాలంటే ఖాతరు లేని జగన్ ఓ శిలువ ఆకారంలో ఏర్పాటు చేసిన మ్యాట్ పై నడిచి క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. జిల్లాలో పొత్తుల్లో భాగంగా ఎక్కడా సీట్లు ఎవరికీ కేటాయించలేదన్నారు. పొత్తు ధర్మంతో ముందుకు వెళ్తూ సంయమనం పాటిద్దామని టిడిపి, జనసేన పార్టీ శ్రేణులకు సూచించారు. అవేశంతో తీసుకునే తప్పుడు ఆలోచనలు, నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోకూడదన్నారు. సీట్ల కేటాయింపు అధినేతలకు వదిలిపెట్టి, ఉమ్మిడిగా కష్టపడి జగన్ రాక్షస పాలనను అంతమొంది రామరాజ్యం తీసుకువద్దామని పిలుపునిచ్చారు.