18 ఏళ్లకు పైబడిన వారు నేరుగా టీకా పొందవచ్చు: కేంద్రం వెల్లడి

దేశంలో లో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చాలా ప్రాంతాల్లో టీకా డోసులు ముందుగా బుక్ చేసుకుని, తమకు నిర్దేశించిన రోజున వారు రాకపోవడంతో ఆ డోసులు వృథా అవుతున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, నేరుగా వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి డోసులు వేయించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దే అప్పటికప్పుడు తమ పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకుని వ్యాక్సిన్ పొందవచ్చని ఓ ప్రకటనలో వివరించింది. అంతర్జాల సదుపాయం లేనివారు, ఫోన్ లేని వారికి కూడా ఈ సదుపాయం వర్తింపచేస్తున్నట్టు వెల్లడించింది.

అయితే, ఇది తమ నిర్ణయం మాత్రమేనని, దీన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఒకవేళ రాష్ట్రాలు తమ ప్రతిపాదనకు సమ్మతిస్తే… ఈ ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ కేవలం ప్రభుత్వ కొవిడ్ టీకా కేంద్రాల వద్దనే అమలు చేయాలని, ప్రైవేటు టీకా కేంద్రాల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది.