వైసీపీ నేతల అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు శుభపరిణామం: ఆళ్ళ హరి

  • ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగిస్తున్న వైసీపీ నేతలు
  • నియంతృత్వ నేతల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు ఎంతోదూరంలో లేవు
  • ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది
  • పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు ఇదే
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

అధికారమదంతో.. నియంతృత్వ పోకడలతో ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి అరాచకపాలన చేస్తున్న వైసీపీ నేతలపై ప్రజల స్వచ్ఛంద తిరుగుబాటు రాష్ట్ర భవిష్యత్ కు శుభపరిణామమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులకు, శాసనసభ్యులకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఇన్నాళ్లు తాము కూర్చుందే ఆసనం.. తాము చేసిందే శాసనం అన్నట్లుగా విర్రవీగిన వైసీపీ నేతలు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం చెప్పలేని స్థితిలో పలాయనం చిత్తగిస్తున్నారని దుయ్యబట్టారు. కొన్నిచోట్ల ప్రజలు వైసీపీ నేతల్ని గట్టిగా నిలదీయటంతో పోలీసుల సహాయంతో తప్పించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మద్యనిషేదం మీద మాట తప్పడం, సంక్షేమ పథకాల తీరులో మడమ తిప్పడం, కొండెక్కి కూర్చున్న నిత్యావసర ధరలతో, ఇష్టానుసారంగా పెంచిన విద్యుత్, బస్ చార్జీలతో, చివరికి చెత్తకి సైతం పన్నులు వేయడంతో ప్రజలు లోలోపల రగిలిపోతున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న తూటాల్లాంటి మాటలను, ఆగ్రహావేశాలను తట్టుకోలేక వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురై ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పరిపాలనపై పట్టుసాధించటం చేతకాక ప్రతీ దానికి పనికిరాని ప్రాసలతో ప్రతిపక్షాలపై, పత్రికలపై, ఎలక్ట్రానిక్ మీడియాపై విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబుని ఈ మూడేళ్ళలో మాకేమి చేసావు అంటూ ప్రజలు శాపనార్ధాలతో తరిమితరిమి ఉరికెత్తించారన్నారు. మాయ లెక్కలతో పిట్ట కథలు చెప్పే ఆర్ధికమంత్రి బుగ్గన మహిళలు అడుగుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి లెక్కలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని అన్నారు. తమ అసమర్ధ పరిపాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తితో, వారిలో వెల్లివిరుస్తున్న చైతన్యంతో వైసీపీ నేతలకు దిక్కుతోచటం లేదన్నారు. ఇన్నాళ్లూ వైసీపీ నేతలు పాడిందే పాట ఆడిందే ఆటగా సాగిందని ఇక ఆ ఆటలు కొనసాగే పరిస్థితులు లేవన్నారు.
ప్రజల్లో ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్న మార్పు ఇదేనన్నారు. ఏపార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు జవాబుదారిగానే ఉండాలని ఆళ్ళ హరి అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రజలిచ్చిన అధికారానికి కృతజ్ఞతగా సుపరిపాలన అంధించాలని లేనిపక్షంలో ప్రజలు రాష్ట్రాన్నుంచి తరిమికొడతారని ఆళ్ళ హరి హెచ్చరించారు.