భారత్‌కు ఫైజర్‌ భారీ సాయం!

గ్లోబల్ దిగ్గజం భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. దేశీయంగా కొవిడ్‌ చికిత్సలో వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు వెల్లడించింది. 70 మిలియన్‌ డాలర్ల (రూ.510 కోట్లకు పైన) విలువ చేసే ఈ ఔషధాలను అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు అందించనున్నట్లు కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు.

భారత్‌కు వీలైనంత త్వరగా తమ సాయం అందే దిశగా చర్యలు చేపడుతున్నామని భారత్‌లోని ఫైజర్ ఉద్యోగులకు రాసిన లేఖలో బోర్లా తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళమని పేర్కొన్నారు. ”ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న కొవిడ్‌-19 బాధితులందరికీ ఈ ఔషధాలు ఉచితంగా అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతోనే ఈ సాయాన్ని అందజేస్తున్నాం” అని బోర్లా తెలిపారు. వీటిని అవసరమైన చోటుకు వీలైనంత త్వరగా చేర్చేందుకు భారత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

అలాగే బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ రూపొందించిన కరోనా టీకా వినియోగానికి భారత్‌లో అనుమతులు లభించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు బోర్లా తెలిపారు. అనుమతి ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కొన్ని నెలల కిందే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, రెండో దశ విజృంభణ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు భారత ప్రభుత్వం ఫైజర్‌ దరఖాస్తును తిరస్కరించింది. భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాలని కోరింది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఆమోదం పొంది వినియోగంలోకి వచ్చిన టీకాలకు కూడా అనుమతి జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.