రూ. 15 లక్షలకు ఏకగ్రీవమైన మురారి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార, విపక్షాలతోపాటు ఎస్‌ఈసీ మధ్య ఏకగ్రీవాల రగడ కొనసాగుతున్న సమయంలోనే సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అవుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల ఏకగ్రీవాలు జరిగినట్టు వార్తలు రాగా, తాజాగా తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి రూ. 15 లక్షలకు ఏకగ్రీవం అయినట్టు తెలుస్తోంది.

ఇక్కడి సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వు కాగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పడంతో గ్రామ పెద్దలు ఏకగ్రీవానికి అంగీకరించినట్టు సమాచారం. అలాగే, జగ్గంపేట మండలంలోని రాజపూడి పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట జరగ్గా రూ. 52 లక్షలు పలికినట్టు తెలుస్తోంది. అలాగే, గుర్రంపాలెంలో టీడీపీ, వైసీపీ నేతలు సమావేశమై అధికార పార్టీ అభ్యర్థికి సర్పంచ్ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం.