తెలుగుజాతి గుండెల్లో పొట్టి శ్రీరాములుది శాశ్వత స్థానం: నెరేళ్ల సురేష్

గుంటూరు: మద్రాస్ ప్రెసిడెన్స్ లో ఆంధ్రులకు ఎదురైన అవమానాలను, అవహేళనలను కళ్లారా చూసి చలించిపోయిన పొట్టి శ్రీరాములు నా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి తన తుది శ్వాస వరకు పోరాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, స్వతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు తెలుగుప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందారని గుంటూరు అర్బన్ జనసేన పార్టీ అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ అన్నారు. గురువారం పొట్టి శ్రీరాములు 70 వ వర్ధంతి సందర్భంగా హిందూ కాలేజీ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన అసమాన అసాధారణ త్యాగశీలి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆశయాలను, ఆకాంక్షలను వల్లెవేయటం వరకే పరిమితమైన నాయకులన్న నేటి కాలంలో వాటిని అక్షరాలా ఆచరించిన ఆదర్శప్రాయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తాను పుట్టింది వైశ్య కులంలో అయినా దళితుల, నిమ్న కులాల హక్కుల కోసం తుదికంటా పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త పొట్టి శ్రీరాములన్నారు. తొలుత గుంటూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర నాయకులు బుడంపాడు కోటీ, త్రిపుర, వీర మహిళలు కవిత, ఆషా, సామ్రాజ్యం, మెహబూబ్ బాషా, రాధాకృష్ణ, శర్మ, పుల్లంసెట్టి ఉదయ్, సింగ్, సుబ్బారావు, శేషు, నవీన్ బందెల, దుర్గ ప్రసాద్, దలవాయు భార్గవ్, తోటకూర విజయ్ తదితరులు పాల్గొన్నారు.