పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శన

గుంటూరు: శ్రీ శ్రీనివాసా నాట్యమండలి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక శ్రీనివాసరావుతోటలోని అచ్చయ్యడాబా సెంటర్లో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నాట్యమండలి అధ్యక్షుడు పట్టంశెట్టి రాంబాబు తెలిపారు. గురువారం శ్రీనివాసరావుతోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనుమరుగవుతున్న నాటక రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. శనివారం జరిగే ఈ నాటకాన్ని తిలకించేందుకు ప్రతీ ఒక్కరికీ తాము ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నట్లు రాంబాబు తెలిపారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ సినీ రంగంలో చరిత్ర సృష్టించిన ప్రతీ నటుడి తొలి అడుగు నాటక రంగం నుంచే మొదలైందన్నారు. సినిమాలు, టీవీలు వచ్చాక నాటక రంగం మసకబారుతూ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాభిమానులు, నాటక ప్రియులు ముందుకు వచ్చి నాటక రంగానికి తమవంతు ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందించాలని కోరారు. సమావేశంలో హార్మోనిష్టు సురేష్, పట్టంశెట్టి చిట్టి, వీరయ్య, రాగమ్మ తదితరులు పాల్గొన్నారు.