ముఖ్యమంత్రి ఎన్ని హామీలను నెరవేర్చారో బహిరంగ చర్చకు సిద్ధం

గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి ఇచ్చినటువంటి హామీలు

1- మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు 5 లక్షల రుణాలు.
2- నామినేటెడ్ పదవులు ప్రభుత్వ కాంట్రాక్టు లో 50% రిజర్వేషన్
3- దుల్హన్ పథకం ద్వారా ముస్లిం చెల్లెమ్మల వివాహానికి లక్ష కానుక
4- మైనారిటీల సబ్ ప్లాన్ తో పాటు ఇస్లామిక బ్యాంక్ ఏర్పాటు
5- హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం
6- మసీదుల్లో ఇమాములు మౌజనులకు ఇల్లు కట్టించి గౌరవ వేతనం నెలకు రూ 15000
7- ప్రమాదవశాత్తు ముస్లిం మైనార్టీ చెందినవారు మరణిస్తే వారికి ఐదు లక్షల భీమా

గురజాల, పైన తెలిపిన హామీలలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని హామీలను నెరవేర్చారో, బహిరంగ చర్చకు సిద్ధమని, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దుదేకుల ఖాసీం సైదా అన్నారు. గురజాలకు చెందిన వైసిపీ ముస్లిం మైనార్టీ నాయకులు, శనివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ, జనసేన పార్టీ వారు మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని అనడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. కోవిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా వచ్చిందనే, విషయాన్ని వైసిపి నాయకులు, మర్చిపోయినట్టున్నారని, ఆయన ఎద్దేవా చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం దెబ్బతినే పరిస్థితి కలిగినందువలన, హామీలను నెరవేర్చేలేక పోయారని, వైసిపి నాయకులు ఒప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ విద్యుత్ బిల్లులు, ఆఖరికి ప్రజల దగ్గర నుండి చెత్త పన్ను కూడా వేసి ప్రజలను పీక్కు తింటున్న ప్రభుత్వం వైసీపీ అని ఆయన అన్నారు. ఇక్కడ ఎవరిని ఎవరు రెచ్చగొట్టడం లేదని, అధికార పార్టీ వారు ముస్లిమ్స్ కి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, విఫలం అయ్యారనే విషయాన్ని చెప్పడం జరిగిందని, వైసిపి నాయకులు తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలుగా అధికార పార్టీ చేసే తప్పులను, ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించటం, మా బాధ్యత అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం పై కూడా పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేశారనే విషయాన్ని వైసిపి నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. అందుకు నిదర్శనమే 2019 లో వైసీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీ ఏర్పడి, ముస్లిం మైనార్టీలందరికీ, సమన్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, షేక్ మదీనా, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు.