క్రిప్టో కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు!

ప్రపంచవ్యాప్తంగా చెలామణి అవుతూ, యువతను ఆకర్షిస్తున్న క్రిప్టోకరెన్సీపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు.

చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవల్సిన అవసరముందన్నారు. డిజిటల్ కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. క్రిప్టో వల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ద సిడ్నీ డయలాగ్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన కీలక ఉపన్యాసం చేశారు. భారత్‌లో క్రిప్టోపై ఎలా ముందుకు వెళ్లాలని ఇటీవల మడీద.. బ్యాంకింగ్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం సందేశం ఇచ్చారు. మనీల్యాండరింగ్‌కు, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు క్రిప్టోమార్కెట్లకు వేదికగా మారుతున్నట్లు ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా వేదికగా ‘ది సిడ్నీ డైలాగ్‌’ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని.. ‘ఇండియా టెక్నాలజీ: ఎవల్యూషన్‌ అండ్‌ రివల్యూషన్‌” అనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ ఎన్నో సంస్కరణలు వస్తున్నాయని, నేటి తరంలో టెక్నాలజీ, డేటా నూతన ఆయుధాలుగా మారుతున్నాయని చెప్పారు. మన చుట్టూ ఉన్న ప్రతి దానినీ డిజిటల్ శకం మార్చేస్తోందని.. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు కొత్త అర్థాలు చెబుతోందని ప్రధాని తెలిపారు. అంతేకాదు పాలన, విలువలు, చట్టం, హక్కులు, భద్రత తదితర అంశాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తతోందని చెప్పారు. అభివృద్ధి, సంపదకు అవకాశాలు కల్పించడంతో పాటు అధికారం, నాయకత్వానికి కొత్త రూపు తెస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో మనం కొత్త ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రధాని మోడీ.

‘క్రిప్టోపై ప్రజాస్వామ్య దేశాలన్ని ఐకమత్యంతో పనిచేయాల్సిన ఆవశక్యత ఎంతో ఉంది. ఇవి తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. లేదంటే అది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉంది.’ అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.