కరోనా వాక్సిన్ పై ప్రధాని కీలక ప్రకటన

కరోనా వాక్సిన్ పై ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త వినిపించారు. కొద్ది రోజుల్లోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాగా, వ్యాక్సిన్‌ ధరపై రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు. ఈ రోజు ప్రధాని అఖిల పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. వాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు చాలా ధీమాగా ఉన్నారన్నారు. భద్రమైన, చవకైన వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎంతో ఎదురు చూస్తోందని అన్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు అంతా భారత్‌ వైపే ఉందన్నారు. మరి కొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారన్నారు. టీకాను ఆమోదించిన వెంటనే దేశంలో వ్యాక్సినేషన్‌ పనులు ప్రారంభిస్తామన్నారు.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే మొదట కోటిమంది హెల్త్ వర్కర్స్ కి కొవిడ్ 19 వ్యాక్సిన్ ని ఇస్తామని కేంద్రం ప్రకటించింది. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సిబ్బంది కూడా ఉంటారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అనంతరం దాదాపు రెండు కోట్లమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.